Serum Institure: ఫిబ్రవరిలోనే... ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరమ్ శుభవార్త!
- తొలి దశలో హెల్త్ వర్కర్లకు, వయో వృద్ధులకు
- సాధారణ ప్రజలకు ఏప్రిల్ లో అందుబాటులోకి
- వెల్లడించిన సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా
ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనికాలు తయారు చేసిన కరోనా టీకాను ఇండియాలో తయారు చేసేందుకు డీల్ కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫిబ్రవరి 2021లో దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా కీలక ప్రకటన చేస్తూ, తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు, వయో వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.
ఆపై ఏప్రిల్ నాటికి సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ రెండు డోస్ ల ధర రూ. 1000 వరకూ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తాము నాలుగు కోట్ల డోస్ లను సిద్ధం చేశామని పేర్కొన్న ఆయన, భారత నియంత్రణా సంస్థల నుంచి అనుమతి లభిస్తే, జనవరిలోపే వ్యాక్సిన్ ను తీసుకుని వస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇక మరో వ్యాక్సిన్ థర్డ్ స్టేజ్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ తో కలిసి నమోదు ప్రక్రియను పూర్తి చేశామని అదర్ పూనావాలా తెలిపారు. ఈ రెండు వ్యాక్సిన్ లతో పాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ తో పాటు మరో రెండు వ్యాక్సిన్ లూ ఇండియాలో ట్రయల్స్ దశలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ ట్రయల్స్ ను సైతం డాక్టర్ రెడ్డీస్ ప్రారంభించింది.