India: నిదానించిన కేసుల పెరుగుదల... 90 లక్షల మార్క్ తాకిన ఇండియా కొవిడ్ కేసులు!
- 80 నుంచి 90 లక్షల మార్క్ కు 22 రోజుల సమయం
- గురువారం నాడు 45,620 కొత్త కేసులు
- 589 మంది మరణించారన్న ఆరోగ్య శాఖ
అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసుల విషయంలో రెండో స్థానంలో ఉన్న ఇండియాలో, నిన్నటితో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల మార్క్ ను దాటింది. అయినప్పటికీ, పరిస్థితి ప్రమాదకరంగా ఏమీ లేదని, కేసుల సంఖ్య 80 లక్షల నుంచి 90 లక్షలకు చేరేందుకు 22 రోజుల సమయం పట్టిందని ఆరోగ్య శాఖ అధికారులు గుర్తు చేశారు. గత కొన్ని వారాలుగా మహమ్మారి వ్యాప్తి నిదానించిందని వెల్లడించారు.
ఇక గురువారం నాడు ఇండియాలో కొత్తగా 46,260 కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 90,03,800కు చేరింది. గడచిన 8 రోజుల్లో కొత్త కేసుల సంఖ్య విషయంలో ఇదే అత్యధికం అయినా, నమూనాల పరీక్షలను పెంచడం కూడా దీనికి ఓ కారణమని అధికారులు వెల్లడించారు. ఇక నిన్న మొత్తం 589 మంది మరణించగా, గత 14 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
సెప్టెంబర్ మధ్య కాలంలో, కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్న వేళ, 40 లక్షల నుంచి, 50 లక్షలకు కేసులు పెరగడానికి కేవలం 11 రోజులు మాత్రమే పట్టిందన్న సంగతి తెలిసిందే. ఇండియాలో కేసుల సంఖ్య ఒకటి నుంచి 10 లక్షలకు చేరడానికి 168 రోజులు పట్టగా, ఆపై 21 రోజుల్లోనే 20 లక్షలకు, 16 రోజుల్లోనే 30 లక్షలకు, 13 రోజుల్లోనే నలభై లక్షలకు చేరాయి.
ఆ తరువాత 11 రోజుల్లోనే 50 లక్షలకు చేరగా, ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 12 రోజుల్లోనే 60 లక్షలకు, 13 రోజుల్లో 70 లక్షలకు, 18 రోజుల్లో 80 లక్షలకు, 22 రోజులకు 90 లక్షలకు పెరుగుతూ వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నవంబర్ లో నమోదైన కేసులను పరిశీలిస్తే, యూఎస్ లో అత్యధికంగా 24.8 లక్షల కేసులు వచ్చాయి. ఇండియాలో 8.2 లక్షలు, ఫ్రాన్స్ లో 7.3 లక్షలు, ఇటలీలో 6.2 లక్షలు, యూకేలో 4.4 లక్షల కేసులు వచ్చాయి.