Jagan: అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం జగన్
- అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను కలుసుకున్న జగన్
- ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ
- విషాదం నుంచి కోలుకోవాలంటూ ఓదార్పు
ఏపీ సీఎం జగన్ ఇవాళ తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవం కోసం కర్నూలు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కర్నూలు ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్దకు అబ్దుల్ సలాం అత్త మాబున్నీసా, ఆమె కుమారుడు షంషావలి, కుమార్తె సాజీదాలను సీఎం జగన్ ఆత్మీయంగా పలకరించారు. విషాదం నుంచి కోలుకోవాలంటూ ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సీఎంను కలిసిన సందర్భంగా అబ్దుల్ సలాం అత్త మాబున్నీసా పలు విజ్ఞప్తులు చేశారు. ఈ ఆత్మహత్యలకు కారకులైన వారిని విడిచిపెట్టవద్దని అన్నారు. తన కుమార్తె సాజీదాకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న తన అల్లుడిని అనంతపురం నుంచి నంద్యాల బదిలీ చేయించాలని కోరారు. మాబున్నీసా వినతుల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సాజీదాకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వాలని, మాబున్నీసా అల్లుడిని నంద్యాల బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.