Zaheer Khan: భారత్-ఆస్ట్రేలియా సిరీస్ లలో జయాపజయాల్ని లిఖించేది బౌలర్లే: జహీర్ ఖాన్
- ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా
- బౌలర్ల ప్రతిభే కీలకం అన్న జహీర్ ఖాన్
- ఆసీస్ పిచ్ లు పేస్ కు సహకరిస్తాయని వెల్లడి
భారత పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ టీమిండియా-ఆస్ట్రేలియా సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయా జట్ల తలరాతను మార్చేది బౌలర్లేనని అభిప్రాయపడ్డాడు. బౌలర్ల రాణింపుపైనే భారత్, ఆస్ట్రేలియా జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశాడు. ఇరు జట్లలోనూ ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారుతుందని వ్యాఖ్యానించాడు. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ... ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ వంటి హేమాహేమీలు ఉన్నారు.
దీనిపై జహీర్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా పిచ్ లు బౌన్స్, పేస్ కు ఎప్పుడూ సహకరిస్తాయి. నాకు తెలిసినంత వరకు వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ, టెస్టుల్లో కానీ కీలకంగా మారేది బౌలర్లే. అయితే ఏ జట్టు బౌలర్లు సమష్టిగా సత్తా చాటి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేస్తారో వారికే అవకాశాలుంటాయి. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లు ఎవరంటే ఎవరి పేర్లు చెబుతామో వాళ్లు ఈ సిరీస్ లో ఆడుతున్నారు" అని వివరించాడు.
అటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రాత్ కూడా రాబోయే సిరీస్ లపై స్పందించాడు. వార్నర్, స్మిత్ ల రాకతో పటిష్టంగా మారిన ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొనబోతోందని, అయితే, భారత్ కూడా అంతే బలంగా ఉందని, దూకుడైన మనస్తత్వంతో సిరీస్ గెలిచేందుకు అవసరమైన పట్టుదల కనబర్చుతోందని తెలిపాడు.