Sunil Gavaskar: కోహ్లీ లేకపోవడం పెద్ద లోటే అయినా అందులోనూ ఓ మంచి విషయం ఉంది: గవాస్కర్
- డిసెంబరు 17 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్
- తొలి టెస్టు తర్వాత భారత్ తిరిగిరానున్న కోహ్లీ
- భారత జట్టు పరిస్థితులపై స్పందించిన గవాస్కర్
భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ టీమిండియా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు. తొలి టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తిరిగిరానుండడంపై స్పందించారు. మిగిలిన మూడు టెస్టులకు కోహ్లీ లేకపోవడం లోటే అయినా, అందులోనూ ఓ సానుకూలాంశం ఉందని గవాస్కర్ పేర్కొన్నారు. కోహ్లీ కెప్టెన్ అయ్యాక అతడు ఆడని ప్రతి మ్యాచ్ లోనూ భారతే విజేతగా నిలిచిందని వెల్లడించారు.
ధర్మశాలలో ఆసీస్ పైనా, ఆఫ్ఘనిస్థాన్ పైనా, శ్రీలంకలో నిదహాస్ ట్రోఫీ, 2018లో ఆసియాకప్ లోనూ భారత జట్టు గెలుపొందినప్పుడు జట్టులో కోహ్లీ లేడని వివరించారు. కోహ్లీ జట్టులో లేడన్న వాస్తవాన్ని గుర్తెరిగి ఇతర ఆటగాళ్లు తమ పూర్తి సామర్థ్యం మేరకు ఆడతారని, కోహ్లీ లేని లోటును పూడ్చాలని ప్రయత్నిస్తారని సన్నీ పేర్కొన్నారు. కోహ్లీ లేని పరిస్థితులను టీమిండియా ఆటగాళ్లు బాగా అర్థం చేసుకుంటారని తెలిపారు.
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ డిసెంబరు 17న ప్రారంభం కానుంది. జనవరిలో తన భార్య అనుష్క శర్మ ప్రసవించనుండడంతో కోహ్లీ పితృత్వపు సెలవుపై స్వదేశానికి చేరుకోనున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టుకు సారథ్యం వహించే అవకాశాలున్నాయి.
కాగా, కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ ప్రసవ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలెన్ బోర్డర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుష్క శర్మ తమగడ్డపై బిడ్డను కంటే ఆ శిశువుకు ఆస్ట్రేలియా జాతీయత అందిస్తామని చమత్కరించారు. తమ దేశంలో పుడితే కనుక ఆస్ట్రేలియనే అవుతారని సరదాగా వ్యాఖ్యానించారు.