Vijayashanti: ఆ రెండు పార్టీలు సయామీ కవలలు... అవసరంలేకున్నా కలిసే ఉంటాయి: విజయశాంతి
- టీఆర్ఎస్, ఎంఐఎం విడిపోవని వ్యాఖ్యలు
- దేశమంతా వ్యాప్తి చెందాలని ప్రయత్నించారని ఆరోపణ
- గతంలో ఫెడరల్ ఫ్రంట్ ను అందరూ చూశారని ఎద్దేవా
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి విమర్శలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సయామీ కవలలు అని, అవసరం లేకపోయినా కలిసే ఉంటాయని తెలిపారు. ఆ రెండు విడదీయలేని పార్టీలని, జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక అవసరమైతే పొత్తు పెట్టుకు తీరతాయని వ్యాఖ్యానించారు.
బీహార్ లో ఎంఐఎం-టీఆర్ఎస్ కలిసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీలు ఇక కాంగ్రెస్ గెలవదన్న అభిప్రాయానికి వస్తారని, తద్వారా అనేక రాష్ట్రాల్లో పట్టు ఏర్పరచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందుకు అవసరమైన నిధులను టీఆర్ఎస్ పెద్దఎత్తున అందించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని విజయశాంతి వెల్లడించారు.
అయితే, బీహార్ ఫలితాలతో తెలంగాణలోని మొత్తం మైనారిటీలు టీఆర్ఎస్-ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని వివరించారు. ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆర్ఎస్ అధినేత ఎంఐఎంతో కలిసి తిరిగి మైనారిటీల నమ్మకం పొందేందుకు జాతీయనేతలతో సమావేశాలు, మోదీపై యుద్ధం వంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవేనని పేర్కొన్నారు.
ఇక, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కుట్రలో భాగంగా చేసినవేనని విజయశాంతి ఆరోపించారు. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవసరంలేదని, అలాంటప్పుడు మతకల్లోలాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎంఐఎం చెబుతున్నట్టు భావించాలా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.