New Delhi: 17 ఏళ్ల తరువాత ఢిల్లీలో 6.9 డిగ్రీలకు పడిపోయిన ఉదయం ఉష్ణోగ్రతలు!

After 17 Years New Delhi Temparature Records Low

  • 2003 నవంబర్ లో 6.1 డిగ్రీలు
  • ఆపై ఆదివారం నాడు కనిష్ఠ ఉష్ణోగ్రత
  • హిమాలయాల నుంచి వీస్తున్న శీతల పవనాలు
  • వెల్లడించిన ఐఎండీ అధికారులు

నవంబర్ 2003 తరువాత... అంటే, సుమారు 17 ఏళ్ల తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నాడు ఢిల్లీలో ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నవంబర్ లో 6.1 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆపై గత శుక్రవారం నాడు 7.5 డిగ్రీలకు, నిన్న 6.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గాయని ఐఎండీ రీజనల్ ఫోర్ కాస్టింగ్ సెంటర్ హెడ్ కుల్ దీప్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రత నగరంలోని పాలం వెదర్ స్టేషన్ సమీపంలో నమోదైందని తెలిపారు.

కనీస ఉష్ణోగ్రత 10 డిగ్రీలకన్నా తగ్గితే, శీతల పవనాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడతాయని ఆయన హెచ్చరించారు. కాగా, గత నాలుగేళ్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, 2017లో 7.6 డిగ్రీలు, 2018లో 10.5 డిగ్రీలు, 2019లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హస్తిన చరిత్రలో 1938, నవంబర్ 28న అత్యల్పంగా 3.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఆపై ఆ స్థాయిలో మరెన్నడూ చలి పులి పంజా విసరలేదని అధికారులు గుర్తు చేశారు.

పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న గాలుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించిన శ్రీవాత్సవ, వచ్చే నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరగవచ్చని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News