BCCI: ఐపీఎల్ 2020 ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం పొందిన బీసీసీఐ
- ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్
- ప్రేక్షకుల్లేకుండా వర్చువల్ విధానంలో మ్యాచ్ ల ప్రసారం
- వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందన్న బీసీసీఐ
ఏ ముహూర్తంలో ఐపీఎల్ ప్రారంభమైందో కానీ బీసీసీఐకి అదో బంగారు గుడ్లు పెట్టే బాతు అయింది. 2008లో తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ప్రపంచంలో మరే క్రికెట్ లీగ్ కు రానంత ప్రాచుర్యం, ఆదాయం ఐపీఎల్ కు లభిస్తోంది. ఇటీవలే యూఏఈ గడ్డపై నిర్వహించిన ఐపీఎల్ 2020 కూడా భారత క్రికెట్ బోర్డుకు ఆర్థిక సంతృప్తినిచ్చినట్టు భావించాలి.
దీనిపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ, ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా బీసీసీఐకి రూ.4 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్ లో 35 శాతం ఖర్చులు తగ్గించుకున్నామని చెప్పారు. వీక్షకుల సంఖ్య కూడా ఈసారి గణనీయంగా పెరిగిందని, టెలివిజన్, డిజిటల్ వేదికలపై ఐపీఎల్ మ్యాచ్ లు తిలకించేవారి సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు.
కాగా, కరోనా నేపథ్యంలో యూఏఈలో ఐపీఎల్ జరిగినన్ని రోజులు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది అందరికీ దాదాపు 30 వేల కరోనా టెస్టులు నిర్వహించినట్టు ధుమాల్ వెల్లడించారు. మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా, వర్చువల్ విధానంలో మ్యాచ్ లు ప్రసారం చేసి లీగ్ ను విజయవంతం చేశామని అన్నారు.