Cinema Theaters: తెలంగాణలో తెరుచుకోనున్న సినిమా హాళ్లు... తక్షణమే వర్తించేలా ప్రభుత్వ ఆదేశాలు
- కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా ఉత్తర్వులు
- కేంద్ర మార్గదర్శకాలు తప్పక పాటించాలని వెల్లడి
- 50 శాతం సీటింగ్ తో షోలు
కరోనా దెబ్బకు కుదేలైన సినీ రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్ ను తెలుగు చిత్రసీమ పెద్దలు పలుమార్లు కలిసి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సర్కారు స్పందించింది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణలో సినిమా హాళ్లు తెరుచుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే, థియేటర్లు పునఃప్రారంభించే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, ఎంటర్టయిన్ మెంట్ పార్కులు, ఇతర వినోద ప్రదేశాలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని, అయితే, కంటైన్మెంట్ జోన్లలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలను కూడా తన ఆదేశాల్లో వివరించింది.
- సినిమా హాల్లోనూ, ప్రాంగణంలోనూ అందరూ మాస్కు ధరించాల్సిందే. ప్రేక్షకులు, సినిమా హాలు సిబ్బంది, హాలు లోపల అమ్మకాలు సాగించే వ్యక్తులు తప్పనిసరిగా అన్ని వేళలా మాస్కులు ధరించాలి.
- సినిమా హాలులోని ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు, ఇతర ప్రదేశాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
- సమూహాలను నియంత్రించే చర్యలు తీసుకోవడంతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలి.
- ప్రతి ప్రదర్శన తర్వాత సినిమా హాలు మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. ముఖ్యంగా, ప్రేక్షకులు ఎక్కువగా తిరుగాడే ప్రదేశాలను తరచుగా శుభ్రపరచాలి.
- ఏసీ థియేటర్లలో హాలు ఉష్ణోగ్రత కచ్చితంగా 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. గాల్లో తేమ శాతం 40 నుంచి 70 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలి. హాలులోకి తాజా గాలి ధారాళంగా ప్రవహించేలా ఏర్పాట్లు ఉండాలి.
- ఒకే కాంప్లెక్సులో పలు షోలు ప్రదర్శించేట్టయితే, ఆయా ప్రదర్శనల ప్రారంభ సమయాలు వేర్వేరుగా ఉండాలి. అన్ని షోలకు ఒకే సమయంలో ఇంటర్వెల్ రాకుండా చూడాలి. తద్వారా ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో గుమికూడే అవకాశాలను తగ్గించాలి.