Bandi Sanjay: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే మా అడ్డా పెడతాం: బండి సంజయ్
- పాతబస్తీ నుంచి దేశ ద్రోహులను తరిమేస్తాం
- వరద బాధితులను కేసీఆర్ పరామర్శించలేదు
- పాతబస్తీలో ప్రచారం చేసే దమ్ము కేసీఆర్ కు లేదు
పాతబస్తీకి సీఎంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాదుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలా? లేక ఒక సీఎం మాత్రమే ఉండాలా? అనే విషయాన్ని నగర ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే తమ అడ్డా పెడతామని... పాతబస్తీ నుంచి దేశ ద్రోహులను తరిమేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ప్రచారం చేసే దమ్ము కూడా కేసీఆర్ కు లేదని అన్నారు.
హైదరాబాద్ పై కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని... కానీ, అవన్నీ నీటి మీద రాతలే అయ్యాయని బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ మార్పు, అభివృద్ధి బీజేపీతో సాధ్యమని చెప్పారు. వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.