Film Chamber: సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి

Film Chamber and Producer Council thanked CM KCR

  • తెలంగాణలో థియేటర్ల పునఃప్రారంభానికి ఆదేశాలు
  • టాలీవుడ్ కోలుకునేలా ఉపశమన చర్యలు
  • జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్
  • టాలీవుడ్ లో వెల్లివిరుస్తున్న హర్షం

సినిమా హాళ్ల పునఃప్రారంభానికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు, కరోనాతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు టికెట్ల రేట్లు సవరించుకునేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం పట్ల టాలీవుడ్ లో హర్షం వ్యక్తమవుతోంది. కరోనాతో కుదేలైన చిత్ర పరిశ్రమ కోలుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఊరట చర్యల పట్ల తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించాయి. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపాయి.

"తెలంగాణలో తక్షణమే సినిమా హాళ్లు తెరుచుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ రంగంలోని అనేక విభాగాలకు లబ్ది చేకూరేలా పలు ఉపశమన చర్యలు ప్రకటించిన సీఎం కేసీఆర్ కు యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అంటూ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

చిత్ర పరిశ్రమ కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన చిరంజీవి, నాగార్జునలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నామని ఫిలిం చాంబర్ తెలిపింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా ధన్యవాదాలు అంటూ వివరించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాటు పడతామని ఫిలిం చాంబర్ ఉద్ఘాటించింది.

అటు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. థియేటర్లు రీఓపెనింగ్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇండస్ట్రీకి మేలు చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించారంటూ కొనియాడారు.

చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్, షోలు పెంచుకునేందుకు థియేటర్లకు అధికారం, టికెట్ల రేట్లను రూ.50 నుంచి రూ.250 వరకు పెంచుకునేందుకు నిర్మాతలకు అనుమతి ఇవ్వడం, సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇచ్చేందుకు హామీ ఇవ్వడం వంటి అంశాలపై సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు మోహన్ వడ్లపట్ల, ప్రసన్నకుమార్ ఓ ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News