cyclone Nivar: భయపెడుతున్న ‘నివర్’.. మరో 12 గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
- మరో 12 గంటల్లో తుపానుగా, 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం
- రేపు సాయంత్రం తీరం దాటనున్న ‘నివర్’
తెలుగు రాష్ట్రాలను ‘నివర్’ తుపాను భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 12 గంటల్లో తుపానుగా, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుండడంతో వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను రేపు సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ‘నివర్’ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, తెలంగాణలోనూ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు తీరంలో రెండు కోస్ట్‌గార్డ్ నౌకలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.