India: క్రమంగా తగ్గుతున్న బంగారం ధర!
- వ్యాక్సిన్ రానుందన్న వార్తలతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల వైపు
- అంతర్జాతీయ మార్కెట్లో 40 డాలర్లు తగ్గిన బంగారం ధర
- ఈ ఉదయం ఎంసీఎక్స్ లో 10 గ్రాములకు రూ. 49,068కి చేరిక
దాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి అవసరమైన వ్యాక్సిన్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుందన్న వార్తలు, ఈక్విటీ మార్కెట్లను ఆకర్షణీయంగా మార్చిన నేపథ్యంలో, బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకు తరలుతుండగా, బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. సోమవారం రాత్రి 10.15 గంటల సమయంలో న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 40 డాలర్లు తగ్గి 1,834 డాలర్లకు తగ్గింది.
ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల ధర రూ. 792 తగ్గి రూ 49,420కి చేరింది. ఇక ఈ ఉదయం ఎంసీఎక్స్ లో డిసెంబర్ 4 కాంట్రాక్టు బంగారం ధర రూ. 412 తగ్గి రూ. 49,068కి చేరగా, వెండి ధర కిలోకు రూ.625 పడిపోయి రూ. 59,900కు చేరింది. ఇదే సమయంలో క్రూడాయిల్ ధర బ్యారల్ కు 1.13 శాతం పెరిగి రూ. 3,231కు చేరుకోగా, నేచురల్ గ్యాస్ ధర 0.24 శాతం తగ్గి రూ. 209కి చేరుకుంది.