Red Alert: నివర్ ఎఫెక్ట్: రాయలసీమకు రెడ్ అలర్ట్... దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Red alert issued in the wake of Nivar cyclone approaches
  • రేపు సాయంత్రం తీరం దాటనున్న నివర్
  • తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుపానుగా నివర్
  • నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'నివర్' తుపాను క్రమంగా తీరంవైపు కదులుతోంది. రేపు సాయంత్రం ఇది తమిళనాడులోని కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) వద్ద తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ప్రత్యేక బులెటిన్ లో వెల్లడించింది. అయితే ఇది తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.

ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 380 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయ దిశగా 430 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. ఇక 'నివర్' కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

ముఖ్యంగా ఈ తుపాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుందంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 'నివర్' దూసుకొస్తున్న నేపథ్యంలో నెల్లూరులో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రేపటి నుంచి 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. 'నివర్' భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు తుపాను స్థాయిలోనే కొనసాగుతుందని భావిస్తున్నారు.
Red Alert
Rayalaseema
Costal Andhra
Orange Alert
Niver
Cyclone
Andhra Pradesh
Tamilnadu
Bay Of Bengal

More Telugu News