Sajjala Ramakrishna Reddy: పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు: సజ్జల
- గత ప్రభుత్వ పెద్దలకు సంపాదనే లక్ష్యమన్న సజ్జల
- రైతులకు మేలు చేయాలన్నది సీఎం ధ్యేయమని వెల్లడి
- పోలవరంపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత తప్పులను సరిదిద్దుతూ పనులు ముందుకు సాగడాన్ని, అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
"నిజంగా పోలవరం గురించి వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే ఒక్కో పార్టీ నుంచి ఒకరో, ఇద్దరో ప్రతినిధులు వస్తే వారికి అధికారులు, ఇంజినీర్లు దగ్గరుండి చూపిస్తారు. ప్రాజెక్టు గురించి అన్ని విషయాలను వారికి విడమర్చి చెబుతారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. మంత్రి అనిల్ కుమార్ కూడా ఇదే విషయం చెప్పారు. అలాకాకుండా, దురుద్దేశంతో గుంపులు గుంపులుగా పోయి నానా యాగీ చేయాలనుకోవడం, జరుగుతున్న పనులను అడ్డుకోవాలని భావించడం సరికాదు. ఇలాంటి ప్రయత్నాలను నిరోధిస్తే, తమను పోలవరం చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది పక్కా రాజకీయం అవుతుందే తప్ప మరొకటి కాదు" అని సజ్జల స్పష్టం చేశారు.
పోలవరం నుంచి సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వంలోని పెద్దలు నడుచుకుంటే, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి రైతులకు మేలు చేయాలన్నది సీఎం జగన్ ధ్యేయం అని తెలిపారు.