Sumalatha: నా ద్వారా బతికి ఉన్నది మీరే: సుమలత భావోద్వేగభరిత వ్యాఖ్యలు
- అంబరీష్ స్మృతిలో సుమలత పోస్టు
- తన మనోభావాలను పంచుకున్న వైనం
- మళ్లీ ఒక్కటయ్యేంత వరకు అంటూ భావోద్వేగాలు
ప్రముఖ నటి, కన్నడ ఎంపీ సుమలత తన భర్త అంబరీష్ జ్ఞాపకాలతో తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. నిన్నటితో అంబరీష్ మరణించి రెండేళ్లు కాగా, ఆయన స్మృతిలో సుమలత తానెంత బాధపడుతున్నారో, అంతకంటే స్ఫూర్తితో ఎలా ముందడుగు వేస్తున్నారో కవితాత్మకంగా వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
"రెండేళ్లు... నిన్ను మళ్లీ చూసుకునేందుకు కళ్లు రెండు మూసుకుంటున్నాను. నీ పిలుపులు చెవులారా వినేందుకు రెండు చెవులు మూసుకుంటున్నాను. కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే నీపై అపారప్రేమ దాగి ఉన్నది నా గుండెలోనే కదా. ఈ హృదయంలో ఒక అపూర్వశక్తిలా, ఎన్నో జ్ఞాపకాలతో మీరున్నారు.
మీతో గడిపిన క్షణాలు ఎంత విలువైనవో. ఇప్పుడు మీరు లేకుండా రెండేళ్లు గడిచిపోయాయి. సవాళ్లు ఎదురైన వేళ నా చేయి పట్టుకుని మీరు నడిపించిన తీరు, నాలో మీరు నింపిన స్థైర్యం, నమ్మకం, ప్రేమ, మీ వారసత్వం.. వీటిసాయంతో నేను చివరివరకు నడుస్తాను. నా చివరి శ్వాస వరకు మీరే. ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు... నా ద్వారా బతికున్నది మీరే. మళ్లీ మనం ఒక్కటయ్యేంత వరకు నా హృదయంలోనే పదిలంగా ఉండండి... నన్ను శక్తిమంతంగా మార్చండి" అంటూ సుమలత తన మనోభావాలను పంచుకున్నారు.
కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్ తీవ్ర అనారోగ్యంతో మరణించడం తెలిసిందే. అంబరీష్, సుమలత దంపతులకు ఓ కుమారుడు అభిషేక్ ఉన్నాడు.