Anand Sharma: రాజ్యసభ సభ్యులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు?: ఆనంద్ శర్మ
- మన దేశంలోని గొప్ప నేతలు ఏదో ఒక సమయంలో రాజ్యసభకు ఎన్నికైనవారే
- రెండు చట్ట సభలు ఉండాలని రాజ్యాంగ రూపకర్తలు చెప్పారు
- రాజ్యసభ సభ్యులు నామినేట్ అయినవారు కాదు
దేశ వ్యాప్తంగా వరుస ఓటమిలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండటం ఆ పార్టీ హైకమాండ్ ను దిక్కుతోచని స్థితిలోకి నెడుతోంది. మరోవైపు పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనా విధానంలో మార్పు రావాలని పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు గత ఆగస్టులో రాసిన లేఖ కలకలం రేపింది.
ఈ సీనియర్లలో ఎక్కువ మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. బీహార్ ఎన్నికల తర్వాత కూడా కపిల్ సిబాల్, గులాం నబీ అజాద్ వంటి నేతలు మరోసారి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఓ సూచన చేసింది. నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు పార్టీ క్రమశిక్షణకు లోబడి నడుచుకోవాలని హెచ్చరించింది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై గీత దాటి మాట్లాడవద్దని తెలిపింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరిని చిన్న చూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మన దేశంలోని గొప్ప నేతలు ఏదో ఒక సమయంలో రాజ్యసభ సభ్యులుగా పని చేసినవారేనని చెప్పారు. ఇందిరాగాంధీ, వాజ్ పేయి, సోమ్ నాథ్ ఛటర్జీ, అద్వానీ వంటి మహామహులు రాజ్యసభ సభ్యులుగా పని చేసినవారేనని అన్నారు.
రెండు చట్ట సభలు ఉండాలని రాజ్యాంగ రూపకర్తలు చెప్పారని ఆనంద్ శర్మ చెప్పారు. మన దేశం ఓ యూనియన్ అని... అన్ని రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. రాజ్యసభ సభ్యులందరూ ఎన్నికైనవారేనని... నామినేట్ అయిన వారు కాదని చెప్పారు. ముఖ్యమైన బిల్లులను తొలుత రాజ్యసభలోనే ప్రవేశపెడతారని అన్నారు.