Swamy Goud: బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్
- జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న స్వామిగౌడ్
- రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీలో చేరిక
- తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గౌడ్
టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. రేపు సాయంత్రం ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్జీవో అధ్యక్షుడిగా స్వామిగౌడ్ కీలకపాత్రను పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైన స్వామిగౌడ్ శాసనమండలి ఛైర్మన్ గా బాధ్యతలను చేపట్టారు. అయితే, గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ కు ఆయన దూరంగా ఉంటున్నారు.
ఇటీవల బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లతో భేటీ అయిన తర్వాత ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ స్వామిగౌడ్ మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు స్పష్టమైన సమాచారం అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకస్తుడిగా ఉన్న స్వామిగౌడ్ బీజేపీలో చేరనుండటం చర్చనీయాంశంగా మారింది.