Pawan Kalyan: ఉమ్మడి కమిటీ వేసి తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేస్తాం: పవన్ కల్యాణ్
- జేపీ నడ్డాతో భేటీ అయిన పవన్ కల్యాణ్
- అమరావతి, పోలవరం అంశాలపై మాట్లాడామన్న జనసేనాని
- అవినీతి, ఆలయాలపై దాడులపై కూడా చర్చించామని వ్యాఖ్య
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పార్టీ నేత మనోహర్ తో కలిసి సమావేశమయ్యారు. భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరం అంశాలపై నడ్డాతో మాట్లాడామని పవన్ చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ, జనసేనల మద్దతు ఉంటుందని తెలిపారు. అమరావతిలోని ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని నడ్డా హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, ఆలయాలపై దాడుల గురించి కూడా చర్చించామని చెప్పారు. దేవాలయాల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై స్పష్టతను ఇవ్వాలని కోరామని తెలిపారు. పోలవరం ప్రజల కోసమే కానీ, పార్టీలకు మేలు చేసేందుకు కాదని నడ్డా చెప్పారని అన్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేస్తామని చెప్పారు. రెండు పార్టీలతో ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయాన్ని ఆ తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.