KCR: కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి.. కఠినంగా వ్యవహరించండి: పోలీసులకు కేసీఆర్ ఆదేశం

 Some anarchist forces are inciting religious hatred says KCR

  • మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు
  • ప్రార్థనా మందిరాల వద్ద వికృత చేష్టలకు పాల్పడాలని చూస్తున్నారు
  • జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాదులో, రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్న కేసీఆర్... అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.

అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి తమ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. సామరస్యంగా ఉన్న వాతావరణాన్ని దెబ్బతీసి, రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నాయని... వాటిని అణచివేయాలని అన్నారు. శాంతిభద్రతలపై ఈరోజు సీఎస్, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైమేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఖమ్మంలోనో, వరంగల్ లోనో, కరీంనగర్ లోనో గొడవలను రాజేసి... హైదరాబాదులో ప్రచారం చేయాలని చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో సైతం ఎక్కడో ఒక చోట గొడవ పెట్టుకుని, దానికి మతం రంగు పులిమి, జనాల మధ్య విద్వేషాలను రాజేయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రార్థనా మందిరాల వద్ద వికృత చేష్టలకు పాల్పడాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులను సృష్టించి, జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను రచించారని అన్నారు.

నగర ప్రశాంతతను దెబ్బతీయాలనుకుంటున్న వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అధికార పార్టీ సభ్యులైనా సరే అలాంటి వారిని వదలొద్దని చెప్పారు. పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలని ఆదేశించారు. విద్రోహ శక్తుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువతను కోరారు.

  • Loading...

More Telugu News