Predator: భారత్ అమ్ములపొదిలో శత్రుభీకర 'ప్రిడేటర్' డ్రోన్లు
- ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకుంటున్న భారత్
- ఇటీవలే రెండు ప్రిడేటర్ డ్రోన్లు అప్పగించిన అమెరికా
- రెండు డ్రోన్లను నేవీలో ప్రవేశపెట్టిన భారత్
సరిహద్దుల్లో చైనాతో ఎప్పటికైనా పేచీ తప్పదని భావిస్తున్న భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. రాఫెల్ యుద్ధ విమానాలు, ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, మిసైళ్ల అభివృద్ధి, పరీక్షలు.. ఇలా తన ఆయుధ పాటవాన్ని మరింత పదునెక్కిస్తోంది. తాజాగా అమెరికా తయారీ ప్రిడేటర్ డ్రోన్లను కూడా భారత్ సమకూర్చుకుంది.
భారత్ తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా రెండు ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కు అందజేసింది. వీటిని ఇటీవలే భారత నావికాదళంలో ప్రవేశపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ రెండు డ్రోన్లను లీజు ప్రాతిపదికన తీసుకున్న భారత్... ఈ రెండు డ్రోన్లు సహా మొత్తం 20 ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఏకధాటిగా 30 గంటల పాటు ఈ డ్రోన్లు గాల్లో ఎగిరే సత్తా ఉండడంతో వీటిని సముద్రతలంపై గస్తీకి ఉపయోగించాలని నేవీ భావిస్తోంది. ప్రిడేటర్ డ్రోన్లు గస్తీ విధులే కాదు, దాడులు కూడా చేయగలవు. వీటిలో కెమెరాలు, సెన్సర్లతో పాటు, అత్యాధునిక ఏజీఎమ్-114 హెల్ ఫైర్ మిస్సైళ్లను కూడా అమర్చారు.
అమెరికా వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఆపరేషన్లకు వినియోగించింది. ఒసామా బిన్ లాడెన్ పై దాడుల్లోనూ వీటి పాత్ర ఉందని రక్షణ నివేదికలు చెబుతున్నాయి. 1995లో అమెరికా సైన్యంలో ప్రవేశించిన ఈ మానవ రహిత విమానాలు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇరాక్, బోస్నియా, సెర్బియా, యెమెన్, సిరియా వంటి కల్లోలిత ప్రాంతాల్లో తమ సేవలు అందించాయి.