New Delhi: రెండు నెలలకు సరిపడా ఆహారంతోనే వచ్చాం... కదిలేది లేదంటున్న ఉత్తరాది రైతులు!

Farmers with Enough Food for Two Months

  • ఢిల్లీ చుట్టూ చేరిన ఆరు రాష్ట్రాల రైతులు
  • గ్యాస్ స్టవ్ లు, ఇన్వర్టర్లు, దుప్పట్లు, టెంట్లు తెచ్చిన రైతులు
  • కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నిల్వలు కూడా

'ఢిల్లీ చలో' పేరిట ప్రదర్శన తలపెట్టిన ఆరు రాష్ట్రాల రైతులు, నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునేంత వరకూ తాము కదలబోమని తేల్చి చెప్పారు. ఢిల్లీకి వెళ్లేందుకు తమకు ఎంత సమయం పట్టినా వేచి చూస్తామని, రహదారులను వీడి స్వస్థలాలకు మాత్రం వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద రెండు నెలల కాలానికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయని రైతులు మీడియాకు వెల్లడించారు.

ఇక ఈ నిరసనల్లో పాల్గొనాలని వచ్చిన ప్రతి రైతు, తన వంతు ఆహార పదార్ధాలను తీసుకుని వచ్చారు. "నా వద్ద రెండున్నర నెలలకు సరిపడా ఆహారం ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ వండుకుని తినడమే" అని తన ట్రాక్టర్ కు మార్పులు చేసుకుని దానిలోనే ఆహార ధాన్యాలను తీసుకుని వచ్చిన తార్పీత్ ఉప్పాల్ అనే రైతు వెల్లడించారు. తార్పీత్ ట్రాక్టర్ లో 5 వేల లీటర్ల వాటర్ ట్యాంక్, గ్యాస్ స్టవ్, ఇన్వర్టర్, , చాపలు, దుప్పట్లు, కూరగాయలు, గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. తనతో వచ్చిన రైతుల్లో ఎవరికీ తిరిగి ఇంటికి వెళ్లాలన్న ఆలోచన లేదని ఆయన అనడం గమనార్హం.

ఇక వీరిని సరిహద్దులు దాటకుండా చేసేందుకు నిన్న పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ తదితరాలను ప్రయోగించారు. రైతులు నేడు కూడా సరిహద్దులు దాటే ప్రయత్నం చేసే అవకాశాలు ఉండటంతో మరిన్ని బలగాలను మోహరించారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షల మంది రైతులు నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరగా, వారందరినీ జాతీయ రహదారులపైనే నిలువరించారు.

  • Loading...

More Telugu News