mink animal: డెన్మార్క్‌లో అధికారులకు కొత్త తలనొప్పి.. నేలపైకి పొడుచుకొస్తున్న మింక్ కళేబరాలు
- మింక్‌ల నుంచి పరివర్తన చెందిన కరోనా వైరస్
- లక్షలాది మింక్‌లను హతమార్చి పూడ్చి పెట్టిన ప్రభుత్వం
- వాటి అంతర్భాగాల్లో గ్యాస్ నిండడం వల్ల బయటకు పొడుచుకొస్తున్న వైనం
మింక్ అనే జంతువుల నుంచి మానవులకు తిరిగి కరోనా సోకుతుండడంతో డెన్మార్క్ ప్రభుత్వం ఇటీవల లక్షలాది మింక్‌లను హతమార్చి భూమిలో పాతిపెట్టింది. అయితే, ఇలా పాతిపెట్టిన మింక్‌ల కళేబరాలు తిరిగి భూమిపైకి పొడుచుకొస్తుండడంతో అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మింక్‌ల ద్వారా పరివర్తన చెందిన కరోనా వైరస్ తిరిగి మానవుల్లోకి ప్రవేశిస్తోంది. పరివర్తన చెందిన ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో డెన్మార్క్ ప్రభుత్వం లక్షలాది మింక్‌లను హతమార్చింది. డెన్మార్క్‌లో ఈ వైరస్ ఇప్పటి వరకు 11 మందికి సంక్రమించింది.
హతమార్చిన మింక్‌లను 2.5 మీటర్ల లోతు, 3 మీటర్ల వెడల్పు కలిగిన గుంతల్లో వేసి, వాటిపైన సుద్ద పొడి వేసి పొరలు పొరలుగా పూడ్చిపెట్టారు. అయితే, నేల వదులుగా ఉన్న చోట పై పొరల్లో ఉన్న కళేబరాలు బయటకు పొడుచుకు వస్తున్నాయి. దీంతో కంగారు పడిన అధికారులు వాటిని పరిశీలించగా, వాటి అంతర్భాగాల్లో గ్యాస్ చేరడమే ఇందుకు కారణమని తేల్చారు.
ఇలా బయటకు పొడుచుకొచ్చిన వాటిని బయటకు తీసి నేల గట్టిగా ఉన్న ప్రాంతాలకు తరలించి పూడ్చిపెడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నక్కలు, పక్షులు అక్కడికి రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కాగా, వచ్చే ఏడాది చివరి వరకు మింక్ ఫారాలు నిర్వహించకుండా డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.