Trisha: బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్.. కథానాయికగా త్రిష!
- ఐదేళ్ల క్రితం వచ్చిన 'పీకూ' హిందీ సినిమా
- తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో కథ
- ప్రధాన పాత్రల్లో అమితాబ్, దీపిక పదుకుణే
- తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ ప్రయత్నాలు
ఇన్నేళ్లుగా తన తర్వాత ఎంతమంది కథానాయికలు వచ్చినా.. ఇంకా వన్నె తరగని సొగసుతో కథానాయికగా తన స్థానాన్ని పదిలంగా చూసుకుంటున్న నటి త్రిష. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు భారీ ఆఫర్లు వస్తూనే వున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చింది. ఓ హిందీ హిట్ సినిమా రీమేక్ లో నటించే అవకాశం త్రిషకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఐదేళ్ల క్రితం సూజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన 'పీకూ' హిందీ చిత్రం సుమారు 140 కోట్లు వసూలు చేసి, మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకుణే తండ్రీ కూతుళ్లుగా నటించారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసే ఉద్దేశంతో ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హక్కుల్ని తీసుకుంది. ఇక ఇందులో దీపిక పాత్రకు త్రిషను సంప్రదించగా, ఆమె వెంటనే ఒప్పేసుకుందని సమాచారం.
తండ్రీకూతుళ్ల అనుబంధాలు ప్రధానంగా.. ఓ రోడ్డు ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో అమితాబ్ చీటికీమాటికీ చిర్రుబుర్రులాడే కోపిష్ఠి తండ్రిగా నటించగా, ఓపక్క ఉద్యోగం చేసుకుంటూ మరోపక్క వృద్ధుడైన తండ్రిని జాగ్రత్తగా చూసుకునే కూతురిగా దీపిక నటించింది. ఇక వీరి ప్రయాణానికి కారు డ్రైవర్ గా ఇర్ఫాన్ ఖాన్ నటించాడు. ముగ్గురూ పోటీపడి మరీ ఆయా పాత్రలు పోషించారు. మరి, తెలుగులో తండ్రి పాత్రను, డ్రైవర్ పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి!