Shoib Akhtar: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డ షోయబ్ అఖ్తర్
- న్యూజిలాండ్ కు వెళ్లిన పాకిస్థాన్ జట్టు
- ఆరుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్
- కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని న్యూజిలాండ్ బోర్డు మండిపాటు
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరినీ ఐసొలేషన్ కు తరలించారు. అయితే, వారిలో కొందరు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, మరోసారి ఇది పునరావృతమైతే పాక్ జట్టును వెనక్కి పంపించేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్టు హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బోర్డుపై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మండిపడ్డాడు.
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాట్లాడుతున్నది ఒక క్లబ్ స్థాయి జట్టు గురించి కాదని అఖ్తర్ అన్నాడు. పాకిస్థాన్ జాతీయ జట్టు మీ దేశంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. తమకు డబ్బుపై యావ లేదని... మ్యాచ్ లు ప్రసారం చేసి మీరే డబ్బు సంపాదించుకుంటున్నారని మండిపడ్డాడు. 'ప్రస్తుత కఠిన సమయంలో కూడా మీ దేశంలో పర్యటించేందుకు మా జట్టు సిద్ధమైంది... అలాంటి జట్టుపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతి గొప్ప దేశం పాకిస్థాన్ అని అన్నాడు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాడు.