Andhra Pradesh: నీటి పొదుపుతో పంటలు.. ‘అనంత’ రైతుకు అంతర్జాతీయ పురస్కారం
- సాగునీటి పొదుపుతో పంటలు పండిస్తున్న శివశంకర్‌రెడ్డి
- దేశం నుంచి ఎంపికైన ఒకే ఒక్క రైతు
- పురస్కారాలను ప్రకటించిన ఐసీఐడీ
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన మేకల శివశంకర్‌రెడ్డికి ఉత్తమ రైతుగా అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఈ మేరకు అంతర్జాతీయ సాగునీటి, డ్రైనేజీ కమిషన్ (ఐసీఐడీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
సాగునీటి పొదుపుతో పంటలు పండించడంలో ఆదర్శంగా నిలిచినందుకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఐడీలో సాగునీటి రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయస్థాయిలో పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయంలో నీటి నిర్వహణ, పొదుపుపై వర్షాధార రైతులను ప్రోత్సహిస్తోంది.
ఈ నేపథ్యంలో బిందు, తుంపర్ల సేద్యం ద్వారా ఎరువుల వినియోగంతో దానిమ్మ, ద్రాక్ష పంటలు పండిస్తూ అత్యధిక దిగుబడులు సాధించినందుకు గాను శివశంకర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కింది. ఐసీఐడీ మొత్తం నాలుగు పురస్కారాలను ప్రకటించగా, భారత్ నుంచి శివశంకర్‌రెడ్డి మాత్రమే ఎంపిక కావడం విశేషం. మిగతా మూడు పురస్కారాలు ఇరాన్‌కు దక్కడం గమనార్హం.