Narendra Modi: హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలిస్తున్న ప్రధాని
- అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ రాక
- భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ అభివృద్ధి పరిశీలన
దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటన ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మొదట అహ్మదాబాద్ లోని జైడస్ క్యాడిలా సంస్థను సందర్శించి, ఆ సంస్థ రూపొందిస్తున్న జైకోవ్-డి కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి హకీంపేట విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
ప్రధాని మోదీ హైదరాబాదులో భారత్ బయోటెక్ క్యాంపస్ ను సందర్శిస్తారు. భారత్ బయోటెక్ లో కోవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఇది మూడో దశ ప్రయోగాల్లో ఉంది. పూర్తి దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ కావడంతో కొవాగ్జిన్ పై అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్ పర్యటన అనంతరం ప్రధాని పూణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు.