Low Pressure Area: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
- డిసెంబరు 2న తీరాన్ని తాకుతుందని ఐఎండీ వెల్లడి
- దక్షిణ కోస్తా, రాయలసీమపైనా ప్రభావం
- ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా, ఆపై మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ వివరించింది. ఇది పశ్చిమ దిశగా పయనించి డిసెంబరు 2 నాటికి దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకుతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో డిసెంబరు 1, 2 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురు వానలు కురుస్తాయని, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.