Tamilnadu: రెండేళ్లకు ముందు పేద... ఇప్పుడు కుబేరుడు... తమిళ రైతుపై కన్నేసిన ఆదాయ శాఖ!
- అనతి కాలంలోనే కోట్ల సంపాదన
- అమాంతం పెరిగిన సంపాదన
- గడచిన వారంగా ఐటీ అధికారుల తనిఖీలు
తమిళనాడులో ఓ రైతు అతి కొద్ది కాలంలోనే కోట్లకు పడగలెత్తగా, అతనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతని ఆదాయ మార్గాలపై కన్నేసి, దాడులు జరుపుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో సదరు రైతు అపార సంపదను ఎలా గడించాడన్న విషయమై రహస్యాన్ని కనుగొనాలని అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా లాక్ డౌన్ కు ముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతను, ఇప్పుడు ఆస్తులను భారీగా పెంచుకున్నాడని అధికారులు గుర్తించారు.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆర్థికంగా చతికిలబడిన కడలూరు ప్రాంతానికి చెందిన రైతు సుగీష్ చంద్రన్, ఇప్పుడు భారీగా ఆస్తులను గడించాడు. బన్రూటి దగ్గరలోని ముత్తు కృష్ణాపురం గ్రామానికి చెందిన అతని కుటుంబానికి ఉన్న పొలాలు తక్కువే. గతంలో ఆయన ఆస్తులు క్రమంగా కరిగిపోగా, ఆపై 24 నెలల వ్యవధిలోనే వారి సంపద అమాంతంగా పెరిగింది. పోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి. కొత్తగా ఎన్నో ఆస్తులను ఆయన కొనుగోలు చేశారు.
ఇక సుగీష్ సంపాదన వెనుక ముంబైలో పనిచేస్తున్న కుమార్తె, అల్లుడు, చెన్నైలోని ఓ ప్రముఖ కంపెనీలో విధుల్లో ఉన్న కుమారుడు కారణమని, కరోనాకు ముందుగా తన స్వగ్రామంలో ఖాళీగా ఉన్న పురాతన భవంతిని కూడా వారు కొనుగోలు చేశారని అధికారులు గుర్తించారు. గడచిన వారం రోజులుగా ఈ కుటుంబంపై దృష్టి సారించిన అధికారులు సోదాలు చేస్తున్నారు.
పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన ఆఫీసర్లు, సోదాల్లో పాల్గొనడం చూసి, ఆ గ్రామం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. తమ కళ్ల ముందు తిరిగిన ఓ పేద రైతు ఇంటికి ఇంతమంది అధికారులు వచ్చి, సెర్చ్ ఆపరేషన్ చేయడంతో పాటు అతని బిడ్డలు, అల్లుడిని కూడా టార్గెట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.