Sasikala: ఫలించని శశికళ ముందస్తు విడుదల ప్రయత్నాలు!
- 2017 నుంచి జైల్లో ఉన్న శశికళ
- ఇప్పటికే జరిమానాను కూడా కట్టేసిన వైనం
- ముందస్తు విడుదల లేదంటున్న కర్ణాటక
తనకు విధించిన జైలు శిక్ష నుంచి సాధ్యమైనంత ముందుగా విడుదల కావాలని భావించిన శశికళ ముందస్తు విడుదల ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ఆమెను విడుదల చేసేందుకు కర్ణాటక జైళ్ల శాఖ అంగీకరించలేదు. దీంతో జైలు గదిలో జయలలిత ఆత్మీయ స్నేహితురాలిగా ఉన్న శశికళ, ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించి, నిత్యమూ భగవంతుడిని ప్రార్థిస్తూ జీవితం గడుపుతున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరైన సమయంలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమె, వాస్తవానికి ఈ పాటికే జైలు నుంచి విడుదల కావాల్సి వున్నా, ఆమె ఇంకా పరప్పన అగ్రహార జైల్లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. 2017, ఫిబ్రవరి 15వ తేదీన జైల్లోకి వెళ్లిన ఆమె శిక్ష, 2021 ఫిబ్రవరి రెండో వారంతో పూర్తి కావాల్సి వుంది. అయితే, జైలు జీవితం గడుపుతున్న వారికి నెలలో మూడు రోజుల చొప్పున సెలవులు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
శశికళ విషయంలోనూ నాలుగేళ్ల శిక్షా కాలంలో 129 సెలవులను బేరీజు వేసుకుంటూ ఆమెను విడుదల చేయాలని శశికళ న్యాయవాది ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు అడ్డంకిగా ఉన్న రూ. 10 కోట్ల జరిమానాను సైతం కట్టించారు. అయితే, అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష పడిన వారు పూర్తి కాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వుంటుందని కర్ణాటక హోమ్ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ తరహా నేరాలకు సత్ప్రవర్తన, సెలవులు వర్తించబోవని రాష్ట్ర హోమ్ మంత్రి బసవరాజ్ తెలిపారు. శశికళను ముందుగా విడుదల చేసేందుకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇదే తరహాలో అవినీతి నిరోధక కేసుల్లో శిక్ష పడిన కొందరిని ముందుగా విడుదల చేసి వుండటంతో శశికళను సైతం విడుదల చేయవచ్చని కొందరు భావిస్తున్నారు.