Iran: ఇరాన్ అణుపితామహడి హత్య.. ట్రంప్‌పైకి మళ్లిన అనుమానం!

Iran suspects donald trump hand behind scientist killing

  • శాస్త్రవేత్త హత్యవెనక ట్రంప్ హస్తం ఉండొచ్చంటూ పరోక్ష వ్యాఖ్యలు
  • ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన
  • ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను గుర్తు చేసిన ఇరాన్ మంత్రి

ఇరాన్ అణు పితామహుడు మొహ‌సెన్ ఫక్రజాదే హత్య వెనక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హస్తం ఉండొచ్చని ఇరాన్ ప్రధాని హసన్ రౌహనీ అనుమానం వ్యక్తం చేశారు. మొహ‌సెన్ హత్యను పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆయన.. ఈ హత్యతో ఇరాన్ అణ్వాయధ సంపత్తిని, సైనిక బలగాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు.  దాడికి పాల్పడినవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు. మొహ‌సెన్  హత్య వెనక ఎవరున్నారో తమకు తెలుసని పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొహ‌సెన్  హత్యపై ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఆయన హత్యపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.  

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఓసారి మాట్లాడుతూ.. మొహ‌సెన్ ఇరాన్‌లో చాలా గొప్ప, బలమైన శాస్త్రవేత్త అని, ఆయన పేరును గుర్తుపెట్టుకోవాలని, మరోమారు ఆయన పేరు వినే అవకాశం ఉండదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలను గుర్తు చేసిన ఇరాన్‌ విదేశాంగమంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్ ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

మొహ‌సెన్ హత్యతో ఇజ్రాయెల్ మోసం వీడిందని ఇరాన్ రక్షణ విభాగ ముఖ్య అధికారి పేర్కొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అణుఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు శాస్త్రవేత్త మొహసెన్ హత్యతో ఇది మరింత ముదిరింది.

  • Loading...

More Telugu News