Corona Virus: కరోనా లక్షణాలు ఉన్న బాధితుల వల్లే వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతోంది: పరిశోధనలో వెల్లడి
- లక్షణాలు లేని వారితో పోల్చితే నాలుగు రెట్లు అధికం
- స్పష్టం చేసిన లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు
- కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ముప్పు అధికం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై శాస్త్రవేత్తలు జరుపుతోన్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. కరోనా సోకినప్పటికీ లక్షణాలు లేని వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, వారితో పోల్చితే కరోనా లక్షణాలు ఉన్నవారు నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు తెలిపారు.
కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ముప్పు అధికంగా ఉంటుందని చెప్పారు. కరోనా నిర్ధారణ అయిన వెంటనే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచాలని చెప్పారు. వివిధ ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిపై వారు పరిశోధన జరిపి ఈ ఫలితాలను వెల్లడించారు.
ఆఫీసులు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇళ్లలోనే కరోనా వేగంగా వ్యాపిస్తుందని, కరోనా సోకిన వ్యక్తితో వరుసగా ఐదు రోజులు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు. లక్షణాలు లేనివారి వల్ల తక్కువగా కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటికీ ఈ తరహా వ్యాప్తిని అడ్డుకోవడం సవాల్‌గా మారిందని తెలిపారు.