Australia: అదే మైదానం... అదే ఆస్ట్రేలియా... అదే విధ్వంసం!

Australia once again slaughtered Team India bowling in Sydney

  • సిడ్నీలో నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే
  • 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
  • శుభారంభం అందించిన వార్నర్, ఫించ్ జోడీ
  • వరుసగా రెండో సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్
  • ఆఖర్లో మ్యాక్స్ వెల్ విధ్వంసం

టీమిండియాతో రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆకాశమే హద్దుగా కదం తొక్కారు. 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ నుంచి మిడిలార్డర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ వరకు భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వరుసగా రెండో సెంచరీ బాదాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ప్రపంచస్థాయి పేసర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన వేళ సిడ్నీ మైదానం మరోసారి పరుగుల జడివానలో తడిసిముద్దయింది.

తొలి మ్యాచ్ కు వేదికైన సిడ్నీ క్రికెట్ మైదానంలోనే రెండో వన్డే కూడా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా, వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ జోడీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 142 పరుగులు జోడించారు. వార్నర్ 77 బంతుల్లో 83 పరుగులు చేయగా, ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. వీరిద్దరూ 14 పరుగుల తేడాతో వెనుదిరగ్గా, ఆ తర్వాత వచ్చిన స్మిత్ టీమిండియా బౌలింగ్ ను చీల్చిచెండాడు. స్మిత్ కేవలం 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు నమోదు చేశాడు. స్మిత్ తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన మార్నస్ లబుషేన్ 61 బంతుల్లో 70 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇక, చివర్లో విధ్వంసం అంతా గ్లెన్ మ్యాక్స్ వెల్ దే. చిచ్చరపిడుగులా చెలరేగిన మ్యాక్సీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో చకచకా 63 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ ఏడుగురితో బౌలింగ్ చేయించినా ఆసీస్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడలేదు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న సిడ్నీ పిచ్ పై భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

  • Loading...

More Telugu News