CPI Narayana: కాషాయ బాహుబలులను చూస్తుంటే గ్రేటర్ ఎన్నికలు కాదు, రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నట్టుంది: సీపీఐ నారాయణ 

CPI Narayana comments on BJP star campaign in GHMC elections

  • హైదరాబాదుకు తరలివస్తున్న బీజేపీ అగ్రనేతలు
  • బీజేపీకి ఓటర్లు గుణపాఠం చెప్పాలన్న నారాయణ
  • బరితెగించారంటూ మోదీ, అమిత్ షాలపై విమర్శలు  

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ వంటి బీజేపీ బడా నేతలు రంగంలోకి దిగడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఒక బక్కాయన (కేసీఆర్)ను ఎదుర్కొనేందుకు ఇంతమంది కాషాయ బాహుబలులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్ కు వస్తుండడం చూస్తుంటే జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలేమో అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఓవైపు కోట్లమంది రైతులు ప్రాణాలకు తెగించి, కరోనాను కూడా లెక్కచేయకుండా, బారికేడ్లను కూడా లక్ష్యపెట్టకుండా ఢిల్లీకి పోటెత్తారని... వారికి బదులు చెప్పలేని కేంద్రం పెద్దలు హైదరాబాద్ రాజకీయ వలస బాట పట్టారని నారాయణ విమర్శించారు. ఢిల్లీలో పారేసుకున్న సూదిని హైదరాబాదులో వెతుక్కుంటున్నట్టుగా బీజేపీ నేతల వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.

లౌకికవాద శక్తులు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, బీజేపీకి హైదరాబాద్ ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. నిన్న కరోనా సెంటిమెంట్, నేడు మతపరమైన సెంటిమెంట్లతో మోదీ, అమిత్ షా అనైతిక రాజకీయ విన్యాసాలతో బరితెగించారని, ఇది కచ్చితంగా లౌకిక నీతిసూత్రాలను అవహేళన చేయడమేనని నారాయణ విమర్శించారు.

  • Loading...

More Telugu News