Diago Maradona: మారడోనా మరణంపై కుమార్తెల అనుమానాలు... వ్యక్తిగత వైద్యుడిని విచారిస్తున్న అధికారులు!
- గత బుధవారం కన్నుమూసిన ఫుట్ బాల్ దిగ్గజం
- అరగంట ఆలస్యంగా అంబులెన్స్ వచ్చిందన్న న్యాయవాది
- ఇంట్లోనే చికిత్స చేసిన వైద్యుడిని విచారిస్తున్న అధికారులు
ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా మరణంపై ఆయన ముగ్గురు కుమార్తెలు అనుమానాలను వ్యక్తం చేయగా, మారడోనాకు తుది రోజుల్లో శస్త్రచికిత్స, వైద్య సేవలను అందించిన వ్యక్తిగత డాక్టర్ ను అధికారులు విచారిస్తున్నారు. మారడోనా మరణంపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో బ్యూనస్ ఎయిర్స్ పోలీసులు మారడోనా వైద్యుడు లియోపోల్డో లూక్విని ప్రశ్నిస్తున్నారు.
కాగా, సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక మారడోనాకు లూక్వి ఇంట్లోనే చికిత్స అందజేశారు. ఆపై ఆయన కోలుకుంటున్నారని కూడా కొన్ని చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఆపై అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో నాలుగు రోజుల క్రితం మారడోనా, ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లారు. ఆయన అంత్యక్రియల తరువాత వైద్యుని ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమ విచారణ కొనసాగుతోందని, మారడోనా కుటుంబీకులను సైతం ఆయనకు అందించిన వైద్య చికిత్సపై ప్రశ్నిస్తున్నామని శాన్ ఇసిడ్రో విచారణ విభాగం అధికారులు వెల్లడించారు. ఇక ఇదే విషయమై స్పందించేందుకు లియోపోల్డో నిరాకరించారు. నవంబర్ 12న సైతం తాను మారడోనాతో ఉన్నానని చెబుతూ, ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఆయన మెదడుకు జరిగిన సర్జరీ విజయవంతం అయిందని మాత్రమే చెప్పగలనని అన్నారు.
గత బుధవారం నాడు మారడోనా తీవ్రమైన గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మారడోనా అంత్యక్రియలు బ్యూనస్ ఎయిర్స్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో ముగిశాయి. అయితే, మారడోనాకు గుండెపోటు వచ్చిందని తాము అంబులెన్స్ విభాగానికి సమాచారం ఇచ్చినా, వారు అరగంట ఆలస్యంగా వచ్చారని మారడోనా న్యాయవాది మాతీస్ మోర్లా ఆరోపించారు. ఇది కూడా ఆయన మృతికి కారణమైందని ఆయన తెలిపారు.