Andhra Pradesh: కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు... కోటి దాటిన టెస్టులు!
- 1,00,17,126 మందికి పరీక్షలు
- తొలి అనుమానితుడికి హైదరాబాద్ లో టెస్ట్
- ఇప్పుడు 150కి పైగా ల్యాబ్ లు అందుబాటులో
- రోజుకు దాదాపు 75 వేల మందిని పరీక్షించే సామర్థ్యం
కరోనా పరీక్షల నిర్ధారణలో ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డును నమోదు చేసింది. నిన్నటికి రాష్ట్రంలో కోటికి పైగా నమూనాలను పరీక్షించారు. నిన్నటివరకూ మొత్తం 1,00,17,126 మంది నమూనాలను పరీక్షించామని వైద్యాధికారులు వెల్లడించారు. తొలి కరోనా కేసు వచ్చిన వేళ, నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా లేని స్థితి నుంచి ఇప్పుడు 150 ల్యాబ్ లలో వేలాది టెస్ట్ లను చేస్తున్నామని, మరణాల రేటు దేశంలోనే అతి తక్కువగా ఉన్నది ఏపీలోనేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ పద్ధతులను పాటించడంలో ఏపీని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.
కాగా, ఏపీలో తొలి కరోనా అనుమానిత కేసు ఫిబ్రవరి 1న రాగా, శాంపిల్ ను తెలంగాణలోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఆపై మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా వైద్య విజ్ఞాన సంస్థలో తొలి టెస్టింగ్ జరిగింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో 150 ల్యాబ్ లతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో 14 వైరాలజీ ల్యాబ్ లు, మరో 4 ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులు చేస్తున్నారు. వీటిల్లో 90 ట్రూనాట్ ల్యాబ్స్ ఉండగా, 6 సీబీనాట్, 5 నాకో, 5 సీఎల్ఐఏ ల్యాబ్ లు, 44 వీఆర్డీఎల్ ల్యాబ్ లు పనిచేస్తున్నాయి.
వీటి ద్వారా రోజుకు దాదాపు 75 వేల నమూనాలను పరిశీలిస్తుండగా, శాంపిల్స్ ను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 122 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ ఏపీలో 8.67 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, టెస్టుల విషయానికి వస్తే, దేశం మొత్తంలో జరిగిన పరీక్షల్లో ఏపీలోనే 7.18 శాతం జరిగాయి. ఇక కోటికి పైగా నమూనాలను పరీక్షించిన రాష్ట్రాల్లో బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మాత్రమే ఉండటం గమనార్హం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలోనే జనాభా తక్కువ.