anakapalle: స్టోన్ క్రషర్ సంస్థకు దిమ్మదిరిగేలా జరిమానా విధించిన ఏపీ అధికారులు
- యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్న సంస్థ
- రెండు రోజుల క్రితమే రూ. 4.5 కోట్ల జరిమానా
- తాజాగా మరో రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాలంటూ నోటీసులు
నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న స్టోన్‌క్రషర్ నిర్వాహకులకు విశాఖ జిల్లా మైనింగ్ అధికారులు కోలుకోలేని షాకిచ్చారు. ఏకంగా 10 కోట్ల రూపాయల జరిమానా విధించారు. అంజని స్టోన్ క్రషర్ అనే సంస్థ అనకాపల్లి మండలం మార్టూరులో మెటల్, రాతి తవ్వకాలకు అనుమతులు సంపాదించింది. అయితే, విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు వెల్లడైంది. 1,67,923 క్యూబిక్ మీటర్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు రూ.9.55 కోట్ల జరిమానా విధించారు. అలాగే, గ్రావెల్ తవ్వకాల్లో జరిగిన అక్రమాలకు గాను మరో రూ. 41.81 లక్షల జరిమానా విధించారు. పన్నులతో కలిపి మొత్తంగా రూ. 10 కోట్లను జరిమానాగా చెల్లించాలంటూ అంజని స్టోన్ క్రషర్‌కు నోటీసులు పంపారు. రెండు రోజుల క్రితం ఇదే సంస్థ వేరే సర్వే నంబరులో అక్రమంగా తవ్వకాలు జరిపినందుకు గాను అధికారులు రూ. 4.5 కోట్ల జరిమానా విధించారు. తాజాగా, మరో పది కోట్ల రూపాయలు జరిమానా విధించడం చర్చనీయాంశమైంది.