AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపు వాయిదా

ap assembly meets

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌, సింగర్ ఎస్పీబీ లకు సంతాపం
  • మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల కూడా సంతాప తీర్మానాలు
  • ఈ రోజు 11 ఆర్డినెన్స్‌లను సభ ముందుకు తీసుకురానున్న వైసీపీ
  • వైసీపీ సర్కారు వైఫల్యాలు, టిడ్కో ఇళ్ల పంపిణీపై నిలదీయనున్న టీడీపీ

ఏపీ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరు సభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు పలువురి మృతికి సంతాప తీర్మానాలను ఆమోదించారు. వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్‌ ఆయా పదవులకు వన్నె తెచ్చారని సభ్యులు కొనియాడారు.

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం నెల్లూరులోని మ్యూజిక్‌, డాన్స్‌ ప్రభుత్వ పాఠశాలను డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్‌, డాన్స్‌ పాఠశాలగా మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకుందని స్పీకర్ తమ్మినేని సీతారాం‌ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది.

శాసనసభలో సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. కాగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, నవరత్నాలు, నాడు-నేడు సహా 30 అంశాల పురోగతిపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.

అంతేగాక, కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చల ద్వారా ఏపీలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాలను, పోలవరం ప్రాజెక్టు పనులు, నాడు-నేడు  పురోగతిని ప్రజలకు సర్కారు వివరించనుంది.  మరోవైపు, ఏపీలో భారీ వర్షాలు, వైసీపీ సర్కారు వైఫల్యం, టిడ్కో ఇళ్ల పంపిణీ వంటి పలు అంశాలపై నిలదీసేందుకు టీడీపీ సిద్ధమైంది. శాసనసభా సమావేశాలు కనీసం 10 రోజులైనా నిర్వహించాలని టీడీపీ డిమాండ్‌ చేయనుంది. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలపై అసెంబ్లీలో టీడీపీ ప్రస్తావించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News