Gautam Gambhir: ప్రపంచంలో ఏ కెప్టెన్ కూడా బుమ్రాకు రెండు ఓవర్లు ఇచ్చి ఆపడు: గంభీర్
- ఆస్ట్రేలియాపై రెండు వన్డేల్లో టీమిండియా ఓటమి
- బుమ్రాకు ఎక్కువ ఓవర్లు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన గంభీర్
- కోహ్లీ కెప్టెన్సీ తనకు అర్థం కావడంలేదన్న గంభీర్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు అర్థంకావడంలేదని వ్యాఖ్యానించాడు. అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కొత్త బంతితో ఎక్కువ ఓవర్లు వేయించకపోవడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. ప్రపంచంలో ఏ కెప్టెన్ కూడా బుమ్రా వంటి బౌలర్ కు రెండు ఓవర్లు ఇచ్చి ఆపేయడని అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్ స్పెల్ లో రెండు ఓవర్ల తర్వాత బుమ్రాను కోహ్లీ పక్కనబెట్టడం వ్యూహాత్మక తప్పిదం అని పేర్కొన్నాడు.
ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ వారి ప్రధాన బౌలర్ జోష్ హేజెల్ వుడ్ ను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నదీ గంభీర్ ఈ సందర్భంగా ఉదాహరించాడు. గత రెండు వన్డేల్లోనూ హేజెల్ వుడ్ ఆసీస్ కు కీలకం అయ్యాడని, తొలి వన్డేలో హేజెల్ వుడ్ తో వరుసగా 6 ఓవర్లు వేయించారని, రెండో వన్డేలో వరుసగా 5 ఓవర్లు వేయించారని, దాని ఫలితమే టీమిండియా టాపార్డర్ ఇబ్బందిపడిందని వివరించాడు.
అదే విధంగా బుమ్రాకు ఎక్కువ ఓవర్లు ఇచ్చి బౌలింగ్ చేయించి ఉంటే ఆసీస్ బ్యాటింగ్ త్రయం వార్నర్, ఫించ్, స్మిత్ ల పనిబట్టేవాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భీకర ఫామ్ లో ఉన్న ఆ ముగ్గురిని అవుట్ చేయగల బౌలర్ టీమిండియాలో ఎవరైనా ఉన్నారా అంటే అది బుమ్రాయేనని స్పష్టం చేశాడు. కానీ, ఓపెనింగ్ స్పెల్ లో కేవలం 2 ఓవర్లు వేయించి, 10వ ఓవర్ తర్వాత మళ్లీ బౌలింగ్ కు తీసుకువస్తే పాతబడిన బంతితో ఎవరుమాత్రం వికెట్లు తీయగలరని అన్నాడు. బుమ్రా కూడా మానవమాత్రుడేనని పేర్కొన్నాడు.