G. Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబమేమీ శాశ్వతం కాదు... ప్రజలంతా పోలింగ్ కు వస్తే గెలుపు మాదే: కిషన్ రెడ్డి
- రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
- ప్రజలు పెద్దమనసుతో పోలింగ్ లో పాల్గొనాలన్న కిషన్ రెడ్డి
- కుటుంబ పాలనతో ప్రజలు విసుగుచెందారని వెల్లడి
- బీజేపీని ఊరూరా వ్యాప్తి చేస్తామని వ్యాఖ్యలు
రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. తెలంగాణకు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం శాశ్వతం కాదని స్పష్టం చేశారు. దుబ్బాక, హైదరాబాదు నుంచి ఇకపై బీజేపీ పోరాటాన్ని ఊరూరా వ్యాప్తి చేస్తామని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో జరిపిన సభలో కేసీఆర్ ముఖంలో కళ లేదని, మాటల్లోనూ ఉత్సాహం లేదని అన్నారు.
ఇక, బీజేపీ గురించి చెబుతూ... ఎన్నికల ప్రచారంలో తాము ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన వచ్చిందని, టీఆర్ఎస్ ను ప్రజలు పట్టించుకోవడంలేదన్న విషయం అర్థమైందని తెలిపారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుంటే విజయం తమదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు ఇంటికి వచ్చి చెప్పినా, చెప్పకపోయినా ప్రజలంతా పెద్దమనసుతో పోలింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని నిలపాలని, తద్వారా కుటుంబ, అవినీతి రాజకీయాలను ఓడించాలని పిలుపునిచ్చారు.