Corona Virus: కరోనా వైరస్ మహమ్మారి ముక్కు ద్వారా మెదడులోకి కూడా చొరబడుతుందట!
- లక్షల మందిని కబళించిన కరోనా
- మెదడులోనూ వైరస్ ఆవాసం
- దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ
- నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం
ఏడాది కాలంగా ఉనికిని చాటుకుంటున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలను బలిగొంది. అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ మహమ్మారి కోట్ల మందికి సోకింది. తాజాగా ఈ వైరస్ పై ఓ ఆసక్తికర అధ్యయనం వెలువడింది. కొవిడ్ ముక్కు ద్వారా మెదడులోకి కూడా ప్రవేశిస్తుందని జర్మనీ పరిశోధకులు గుర్తించారు. కొందరు కరోనా రోగుల్లో నరాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అధ్యయనం నేచర్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది.
సార్స్ కోవ్-2 కేవలం శ్వాస వ్యవస్థనే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని, తత్ఫలితంగా రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం, నరాలకు సంబంధించిన సమస్యలు కలుగుతాయని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలి ఓ అధ్యయనంలో... మెదడులోనూ, సెరెబ్రోస్పైనల్ ద్రవాల్లోనూ వైరస్ కు సంబంధించిన ఆర్ఎన్ఏ ఉన్నట్టు గుర్తించినా, వైరస్ ఎలా ప్రవేశిస్తోందీ.. మెదడులోపలి భాగాల్లో ఎలా పాకిపోతోంది? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇది ముక్కు ద్వారానే మెదడులో చొరబడుతోందన్న విషయం తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.
గొంతు పైభాగంలో ఉండే నాసికాగ్రసనిలో తొలిస్థావరం ఏర్పరచుకుంటున్న కరోనా రక్కసి, అక్కడి నుంచి నాసికా కుహరం ద్వారా మెదడులోకి పాకుతోందని తెలుసుకున్నారు. కరోనాతో మరణించిన 33 మంది రోగులపై పరిశోధనలు చేసి ఈ వివరాలు గుర్తించారు. కాగా, కరోనా వైరస్ కు సంబంధించిన జన్యుపదార్థం ఆర్ఎన్ఏ... ఘ్రాణ శ్లేష్మ పొరలో అత్యధిక పాళ్లలో ఉన్నట్టు జర్మనీ పరిశోధకులు కనుగొన్నారు.