Kurnool District: ఓంకార దేవస్థానం పూజారులపై వైసీపీ నేత దాడి.. కేసు నమోదు!
- కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార ఆలయంలో ఘటన
- రాత్రివేళ టికెట్ల విక్రయం కూడదన్న పూజారులు
- అటెండర్ ఫిర్యాదుతో మనుషులతో వచ్చి కొరడా, కర్రలతో దాడిచేసిన పిట్టం ప్రతాప్‌రెడ్డి
- విచారణకు ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి
దర్శనం టికెట్ల విక్రయం విషయంలో చెలరేగిన గొడవలో ఆలయ చైర్మన్ అయిన వైసీపీ నేత పూజారులపై కొరడాతో విరుచుకుపడ్డాడు. ఇష్టం వచ్చినట్టు చావబాదాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలోని ఓంకార ఆలయంలో జరిగిందీ ఘటన.
ఆదివారం రాత్రి దేవస్థానం ఆవరణలో అటెండర్ ఈశ్వరయ్య దర్శనం టికెట్లు విక్రయిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పూజారి సుధాకరయ్య, ఆయన కుమారులు చక్రపాణి, మృగపాణి ఇది చూసి, రాత్రివేళ టికెట్లను విక్రయించకూడదన్న నిబంధన ఉందని గుర్తు చేశారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగి ఆపై తోపులాటకు దారితీసింది. తోపులాటలో కిందపడిన అటెండర్ ఈశ్వరయ్య ఆలయ చైర్మన్, వైసీపీ నాయకుడు అయిన పిట్టం ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతాప్‌రెడ్డి, ఆలయ సూపర్ వైజర్ నాగరాజు, మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
ప్రతాప్‌రెడ్డి వచ్చీ రావడమే పూజారులపై కొరడాతో దాడిచేయగా, ఆయనతో వచ్చినవారు కర్రలతో పూజారులపై విరుచుకుపడ్డారు. వెంబడించి మరీ కొట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చక్రపాణి గుడిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు.