GHMC Elections: నందినగర్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
- ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
- అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్న టీఆర్ఎస్
- అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 415 మంది స్వతంత్రులు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, బంజారాహిల్స్ నందినగర్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని మొత్తం 150 డివిజన్లకు జరుగుతున్న పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.
అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు 76 స్థానాల్లో పోటీ చేస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కోసం మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 74,67,256 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.