Moderna: అన్ని వయసుల వారిలోనూ మా వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరం: మోడెర్నా కీలక ప్రకటన

Moderna says Vaccine 100 Percent Effective on Serious Cases

  • వ్యాక్సిన్ అధ్యయనాల సమర్పణ
  • అద్భుతమైన ప్రభావం చూపుతున్న టీకా
  • మహమ్మారిని పారద్రోలుతామన్న మోడెర్నా సీఎంఓ తాల్ జాక్స్

తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి వెంటనే అనుమతించాలని అటు యూరప్ లో, ఇటు యూఎస్ లో మోడెర్నా ఐఎన్సీ దరఖాస్తు చేసింది. టీకా అధ్యయనాల ప్రకారం, 94.1 శాతం వరకూ వ్యాక్సిన్ పనిచేస్తోందని, ఎవరిలోనూ తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని సంస్థ వెల్లడించింది. అన్ని వయసు వారిలోనూ వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరమని, కరోనా తీవ్రమైన కేసుల విషయంలోనూ 100 శాతం సక్సెస్ రేటును సాధించామని పేర్కొంది.

కాగా, యూఎస్ లో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి కోరిన రెండో టీకా మోడెర్నాదే కావడం గమనార్హం. ఇప్పటికే ఫైజర్ సంస్థ తన ట్రయల్స్ లో 95 శాతం సక్సెస్ రేటు వచ్చిందని ప్రకటించి, వినియోగానికి అనుమతించాలని కోరిన సంగతి తెలిసిందే.

 "మా వ్యాక్సిన్ అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోందని నమ్ముతున్నాం. దాన్ని నిరూపించేందుకు మా వద్ద గణాంకాలు కూడా ఉన్నాయి" అని మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తాల్ జాక్స్ తెలిపారు. ఈ మహమ్మారిని పారద్రోలే విషయంలో తమ సంస్థ కీలక భాగస్వామిగా మారుతుందని ఆయన అన్నారు.

మొత్తం 30 వేల మందిని ట్రయల్స్ దశలో భాగం చేశామని, వీరిలో 196 మంది వలంటీర్లు కరోనా సోకిన వారేనని, 30 తీవ్రమైన కేసుల విషయంలోనూ తమ వ్యాక్సిన్ 100 శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని మోడెర్నా సీఎంఓ పేర్కొన్నారు. అమెరికాతో పాటు యూరప్ మెడిసిన్ ఏజన్సీస్ నుంచి కూడా తాము అనుమతులు కోరామని, ప్రస్తుతం తామిచ్చిన గణాంకాలను అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. మిగతా దేశాల నియంత్రణా సంస్థలను కూడా తాము సంప్రదిస్తున్నామని తెలిపారు.

ఇక ఈ ఏడాది చివరకు 2 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సిద్ధం చేస్తామని, దీనితో కోటి మందికి టీకాను అందించవచ్చని, ఆపై మరింత వేగంగా టీకా తయారీ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రెండు వ్యాక్సిన్ లలో అధునాతన సాంకేతికత మెసింజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) విధానంలో తయారు కాగా, ఆస్ట్రాజెనికా సంప్రదాయ పద్ధతుల్లో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.

  • Loading...

More Telugu News