Atchannaidu: అవాకులు చెవాకులు మానుకోకుంటే జగన్ పై ప్రతి టీడీపీ కార్యకర్త గట్టిగా స్పందించాల్సి వస్తుంది: అచ్చెన్నాయుడు
- సభలో నిన్న చంద్రబాబు, జగన్ మధ్య మాటలయుద్ధం
- మంత్రులు చంద్రబాబును ఏకవచనంలో సంబోధించారన్న అచ్చెన్న
- చంద్రబాబు నిరసన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నిన్న సభలో రభస జరిగిన విషయం తెలిసిందే. పంట నష్టం, బీమా అంశాలపై చర్చ సమయంలో విపక్ష నేత చంద్రబాబు, సీఎం జగన్ మధ్య మాటలయుద్ధం జరిగింది. దీనిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ మంత్రులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ తరహా అవాకులు చెవాకులు మానుకోకుంటే జగన్ పై ప్రతి టీడీపీ కార్యకర్త గట్టిగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు.
తమ అధినేత చంద్రబాబు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన తర్వాతే పంట బీమా చెల్లింపుకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇచ్చిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు నిరసనతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు.
సభలో పంట బీమాపై తాము నిలదీస్తే, బీమా చెల్లించామంటూ సీఎం, వ్యవసాయమంత్రి ఇద్దరూ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. పంట కోల్పోయాక, రైతులు చనిపోయిన తర్వాత ప్రీమియం చెల్లించినందువల్ల ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని మోసం చేస్తోందో అందరూ గమనించాలని అన్నారు.