Nimmala Rama Naidu: ఆధారాలతో వాస్తవాలు బయటపెడుతున్నందుకే నన్ను సస్పెండ్ చేశారు: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

Nimmala Rama Naidu says he was suspended from Assembly because he exposed the facts of govt failures

  • ఇన్స్యూరెన్స్ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేసింది
  • ఈ విషయాన్ని బయటపెట్టినందుకు నన్ను సస్పెండ్ చేశారు
  • నిన్న రాత్రి హడావుడిగా ఇన్స్యూరెన్స్ ప్రీమియం జీవో విడుదల చేశారు

ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న చంద్రబాబు సహా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని... ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పంట ఇన్స్యూరెన్స్ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేసిందని... ఆ విషయాన్ని డాక్యుమెంట్ సహా వెల్లడించామని చెప్పారు. ఆధారాలతో వాస్తవాలను బయటపెట్టినందుకే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ నిలదీసిన తర్వాత నిన్న రాత్రి 9.02 గంటలకు హడావుడిగా ఇన్స్యూరెన్స్ ప్రీమియం జీవో ఇచ్చారని, బడ్జెట్ విడుదల చేశారని నిమ్మల ఎద్దేవా చేశారు. రైతులు నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఇన్స్యూరెన్స్ ప్రీమియం కడితే ఉపయోగం ఉండదని అన్నారు. రైతు చనిపోయిన తర్వాత ప్రీమియం చేయిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.

అసెంబ్లీని, రాష్ట్రంలోని రైతులను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. అరకొరగా ప్రీమియంలు కట్టడం వల్ల 2019లో ఒక్క  క్లైమ్ కూడా రాలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి రైతుకు బీమా అందిందని తెలిపారు. తమపై ఎన్ని సస్పెన్షన్లను విధించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News