Justin Trudeau: ఢిల్లీలో రైతుల నిరసన కార్యక్రమాలపై కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు!
- శాంతియుతంగా నిరసనలు తెలిపేవారికి కెనడా అండగా ఉంటుంది
- రైతుల నిరసనలపై ఆందోళన చెందుతున్నాం
- చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు పలు పార్టీలకు చెందిన నేతలు తమ మద్దతును ప్రకటించారు. అయితే, తొలిసారి ఇండియాకు వెలుపల నుంచి ఒక దేశాధినేత రైతులకు అనుకూలంగా మాట్లాడారు. ఆయనెవరో కాదు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.
శాంతియుతంగా నిరసనలు తెలిపేవారికి కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని ట్రూడో అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. గురునానక్ 551 జయంతి సందర్భంగా ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియోను కెనడాలోని సిక్కు సంఘాలు విడుదల చేశాయి. కెనడాలో పంజాబీ సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు పంజాబ్ నుంచి తరలివెళ్లినవారే అనే విషయం కూడా విదితమే.
ఈ నేపథ్యంలో ట్రూడో మాట్లాడుతూ, రైతుల ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయని చెప్పారు. నిరసన కార్యక్రమాలను చేపడుతున్న వారి కుటుంబాలు, స్నేహితుల గురించి ఆందోళనగా ఉందని అన్నారు. అహింసాయుతంగా హక్కుల కోసం పోరాడే వారి పక్షాన కెనడా ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పారు.
ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రూడో అన్నారు. ఇదే విషయాన్ని ఇండియా అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లామని చెప్పారు. తమ ఆందోళనను వెలిబుచ్చామని తెలిపారు. అందరం ఏకం కావడానికి ఇది సరైన సమయమని చెప్పారు. ట్రూడో వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.