Petition: కార్యాలయాలకు వైసీపీ రంగులపై పిటిషన్... విచారణ వాయిదా
- ప్రజాధనం వృథా అయిందన్న పిటిషనర్
- రూ.4 వేల కోట్లను రాబట్టాలని విజ్ఞప్తి
- సీఎస్, మంత్రులను ప్రతివాదులుగా చేర్చిన వైనం
- అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం పట్ల విమర్శలు రావడం తెలిసిందే. ఆపై ప్రభుత్వం ఆ రంగులను తొలగించింది. ఈ అంశంలో హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. రంగులేసి తీసినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చయ్యాయని, వృథా అయిన ఆ ప్రజాధనం మొత్తాన్ని రాబట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రూ.4 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ కోరారు.
రాష్ట్ర సీఎస్, మంత్రులు బొత్స, బుగ్గన లను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చుతూ ఈ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్ ను ఆదేశించింది. సీఎస్, మంత్రులను ఎందుకు ప్రతివాదులుగా చేర్చారంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.