Jagan: చంద్రబాబు, కమ్యూనిస్టుల మధ్య మంచి ఒప్పందం ఉంది: సీఎం జగన్
- పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న జగన్
- టీడీపీ నేతలతో కేసులు వేయిస్తున్నారని ఆరోపణ
- చంద్రబాబుకు కమ్యూనిస్టులు తోడయ్యారని వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. తద్వారా 24 లక్షల మంది నిరుపేదలకు ఇళ్లు అందకుండా చేస్తున్నారని అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నించామని.... కానీ, కులాలు, వర్గాల సమీకరణలు మారిపోతాయంటూ కేసులు వేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో చంద్రబాబుకు కమ్యూనిస్టులు కూడా తోడయ్యారని, కమ్యూనిస్టులు కాస్తా కమ్యూనలిస్టులుగా మారిపోయారని వ్యంగ్యం ప్రదర్శించారు. లబ్దిదారులకు చూపించే ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు, కమ్యూనిస్టుల మధ్య మంచి ఒప్పందం ఉందని తాజా పరిణామాలతో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
ఆఖరికి పరిటాల సునీత అనుచరుడు కూడా కోర్టులో కేసు వేశాడని, కోర్టుల్లో కేసులు వేయడం, తీర్పులు రావడం సాధారణమైపోయిందని అన్నారు.