Kurnool District: పూజారిపై దాడి కేసులో ఓంకార ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అరెస్ట్
- ఆదివారం రాత్రి నిబంధనకు విరుద్ధంగా టికెట్ల విక్రయం
- ప్రశ్నించినందుకు చైర్మన్ ప్రతాప్‌రెడ్డితో కలిసి దాడి
- కొరడాతో వెంబడించి కొట్టిన వైసీపీ నేత
- రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
పూజారులను కొరడాతో చావబాదిన కేసులో కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార ఆలయ చైర్మన్ పిట్టం ప్రతాప్‌రెడ్డితోపాటు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు నాగరాజు, ఈశ్వరయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం రాత్రి ఆలయ ఆవరణలో అటెండర్ ఈశ్వరయ్య టికెట్లు విక్రయిస్తుండడాన్ని పూజారి సుధాకరయ్య, ఆయన కుమారులు చక్రపాణి, మృగపాణి ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. తోపులాటలో కిందపడిన అటెండర్ ఈశ్వరయ్య ఆలయ చైర్మన్, వైసీపీ నాయకుడు అయిన పిట్టం ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతాప్‌రెడ్డి, ఆలయ సూపర్ వైజర్ నాగరాజు, మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
ప్రతాప్‌రెడ్డి వచ్చీ రావడమే పూజారులపై కొరడాతో దాడిచేయగా, ఆయనతో వచ్చినవారు కర్రలతో పూజారులపై విరుచుకుపడ్డారు. వెంబడించి మరీ కొట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చక్రపాణి గుడిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ప్రతాప్‌రెడ్డిని ఆలయ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని సూచిస్తూ విచారణ కమిటీ దేవాదాయ కమిషనర్‌కు నివేదిక పంపింది.
కాగా, ఆలయ పూజారులపై జరిగిన దాడిపై ఏపీ వ్యాప్తంగా బ్రాహ్మణులు భగ్గుమన్నారు. ఆదిశైవ బ్రాహ్మణ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుబ్బ సత్యనారాయణ శర్మ, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు మహేశ్వర శర్మ, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు నందీశ్వర శర్మ, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బస్వరాజు ఆధ్వర్యంలో నిన్న ఆలయం ఎదుట బైఠాయించి ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, తమకు న్యాయం జరగకుంటే ఉరివేసుకుంటామని బాధిత పూజారులు సుధాకరయ్య, ఆయన కుమారులు హెచ్చరించారు. విచారణకు వచ్చిన దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్ కారుపైకి ఎక్కి హెచ్చరించారు. దీంతో దిగి వచ్చిన అధికారులు దాడికి పాల్పడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని, పాలకమండలి రద్దు, ఈవో మోహన్ సస్పెన్షన్ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం రాత్రి ప్రతాప్‌రెడ్డి, కాంట్రాక్ట్ కార్మికులను అరెస్ట్ చేశారు.